Earth Quake: మయన్మార్, బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లో భూకంపం 6 d ago

వారిపై దేవుడు కనికరం చూపలేదు..
వారిపై కాలం జాలి చూపలేదు..
వారికి ఆ ఊరితో బంధాలు తెగిపోయాయి..
వారికి ఆ భూమితో రుణం తీరిపోయింది.
వారు.. చేయని తప్పుకు నిండు ప్రాణాలు కోల్పోయారు
వారు.. అందరినీ వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు
మయన్మార్, బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భూకంపంపై స్పెషల్ స్టోరీ
బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లో భూకంపం తీవ్రత అంతగా లేకపోయినా మయన్మార్‌లో మాత్రం విలయతాండవం సృష్టించింది. ఇక్కడ భూకంపం రావడం వలన అనేక మంది విగతజీవులుగా మారిపోయారు. మరెంతో మంది గాయాలపాలయ్యారు. అనేక మంది అనాథలైపోయారు. అప్పటి వరకు హాయిగా గాలి పీల్చుకున్న వారంతా ఆ గాలిలోనే కలిసిపోయారు. ఎంతో ఆనందంగా గుడుపుతున్న వారిని చూసి ఆ పంచభూతాలు అసూయపడ్డాయి. ఏమీ తప్పు చేశారో తెలియదు కానీ.. వారందరినీ ఆ పంచభూతాలే కాలగర్భంలో కలిపేశాయి.
ఈ భూకంపం ధాటికి తల్లిదండ్రులు కోల్పోయి అనేక మంది చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఇక వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కనీసం వారిని చూసే వారే కరువయ్యారు. కనీసం వారికి తినడానికి తిండి, తాగడానికి నీరు ఇచ్చే వారు కూడా లేరు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ చిన్నారులు కోల్పోవడంతో కడుపుకోత మిగిలింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా చావు కేకలు, ఆర్తనాథాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఎవరినీ చూసినా కంట నీరుతోనే దర్శనమిస్తున్నారు.
మయన్మార్, థాయ్‌లాండ్‌లను భూకంపాలు కుదిపేశాయి. పెద్ద పెద్ద వంతెనలు, భవనాలు నేలకూలాయి. ఈ రెండు దేశాల్లో కలిపి 1000 మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఒక్క మయన్మార్‌లోనే 1002 మంది చనిపోగా, మరో 2,370 మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అనేక మంది నిరాశ్రయులుగా మిగిలారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక బ్యాంకాక్‌లో 10 మంది మృతి చెందగా 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఎవరూ చేయని తప్పుకు ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం.